pranay: 'పరువు హత్య' అనే పదంపై మండి పడుతున్న విద్యావేత్తలు!

  • దారుణ హత్యలను పరువు హత్యలంటూ గౌరవంగా పిలుస్తారా?
  • మతవాద, కులవాద శక్తులే వీటిని పరువు హత్యలని పిలుస్తాయి
  • వేళ్లూనుకున్న కుల వ్యవస్థకు పరువు హత్యలు ఒక నిదర్శనం

తమ కన్నా తక్కువ కులం వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతో... మిర్యాలగూడలో కన్న కూతురు భర్తను అత్యంత పాశవికంగా కన్న తండ్రి చేయించిన పరువుహత్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరువు హత్య జరగడం ఇదే తొలిసారి కాదు. దేశ వ్యాప్తంగా అనునిత్యం ఎక్కడో ఒక చోట ఈ పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అత్యంత కిరాతకంగా, పాశవికంగా జరిగే దారుణ హత్యలను పరువు హత్య అనే పేరుతో గౌరవంగా పిలవడం ఏమిటని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

మతవాద, కులవాద శక్తులే ఇలాంటి హత్యలను పరువు హత్యలని పిలుస్తాయని... కుల వ్యవస్థ ఈ సమాజంలో ఎంతలా వేళ్లూనుకుందో చెప్పడానికి ప్రణయ్ హత్య ఒక నిదర్శనమని హెచ్సీయూ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి అన్నారు. ప్రణయ్ ది పరువు హత్య కాదని, పరువు తీసే హత్య అని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ విమర్శించారు.

దళితులపై జరుగుతున్న అరాచకాల పట్ల సమాజంలో ఏమాత్రం సానుభూతి, సామాజిక స్పందన లేదనే విషయాన్ని పరువు హత్య అనే పదం సూచిస్తుందని దళిత కార్యకర్తలు యెగ్గోని జయరాజ్, దునా అంబేడ్కర్ లు చెప్పారు. ప్రణయ్ ను చంపింది కుల దురహంకారమేనని వారు మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News