Chandrababu: చంద్రబాబుపై పెట్టిన కేసు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ కేసుకన్నా చిన్నది: భూమన
- బాబ్లీ కేసు ఒక చెత్త కేసు
- శిక్ష కూడా పడని చిన్న కేసు
- తెలంగాణలో సానుభూతి ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారు
బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే... జగన్, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కుట్రలు చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మాటలను సుమోటోగా కోర్టు పరిగణించాలని కోరారు. వాస్తవానికి చంద్రబాబుకు శిక్ష కూడా పడని ఓ చెత్త కేసు ఇది అని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసిన కేసుకన్నా... ఇది చాలా చిన్న కేసు అని చెప్పారు. ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణ జరిపించాలని కోరే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
గత నాలుగేళ్లలో వైసీపీ నేతలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని భూమన మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి ఆంజనేయస్వామి తోక అంత పెద్దగా ఉందని ఎద్దేవా చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అక్రమాలు, పుష్కరాల దుర్ఘటన, ఓటుకు నోటు ఘటనల్లో చంద్రబాబుపై ఒక్క కేసు కూడా లేదని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసమే ఓ చెత్త కేసును చంద్రబాబు తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలకు టీడీపీ నేతలు భజన చేస్తున్నారని విమర్శించారు.