amrutha: ప్రణయ్ హత్య కేసుకు రాజకీయ రంగు పులుముతున్నారు: నల్గొండ ఎస్పీ
- మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నయీం అనుచరుల హస్తం ఉన్నట్టు ఆధారాలు లేవు
- తండ్రి మారుతీరావే సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించారు
- దర్యాప్తులో పెద్దల పేర్లు వచ్చినా.. వదిలిపెట్టం
మిర్యాలగూడలో పరువుహత్యకు గురైన ప్రణయ్ కేసుకు కొందరు కావాలనే రాజకీయ రంగు పులుముతున్నారని నల్గొండ ఎస్పీ రంగనాథ్ అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నయీం గ్యాంగ్ సభ్యులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ప్రణయ్ ను అమృత తండ్రి మారుతీరావే హత్య చేయించారని తెలిపారు.
మారుతీరావు తన కుమార్తెను నమ్మించి, హత్య చేయించారని చెప్పారు. ప్రణయ్ ను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ కు డబ్బు ఇచ్చారని తెలిపారు. గతంలో అనేకసార్లు మారుతీరావును పిలిపించి, హెచ్చరించామని చెప్పారు. ప్రణయ్ కుటుంబసభ్యుల నుంచి కానీ, అమృత నుంచి కానీ ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా, ఇంత దారుణం జరిగేది కాదని తెలిపారు. కేసు దర్యాప్తులో ఎంత మంది పెద్దల పేర్లు వచ్చినా, వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.