Haryana: సీబీఎస్ఈ టాపర్‌పై గ్యాంగ్‌రేప్ కేసులో కీలక నిందితుడి అరెస్ట్
- సామూహిక అత్యాచారానికి కర్త, కర్మ, క్రియ నిషూనే
- గత సాయంత్రం అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నిందితుల్లో ఓ వైద్యుడు కూడా
హరియాణాలోని రేవారిలో సీబీఎస్ఈ టాపర్ (19)పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడైన నిషును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అతడిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అత్యాచారం ఘటనలో అతడే ప్రధాన సూత్రధారని, ప్లాన్ చేసిందీ, పక్కాగా నిర్వహించిందీ అతడేనని పేర్కొన్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఓ వైద్యుడు కూడా ఉన్నట్టు తెలిపారు. రేప్ జరగబోతోందన్న విషయం అతడికి ముందే తెలుసన్నారు.
యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం దీన్ దయాళ్‌కు నిషు ఫోన్ చేసి రూమ్ అడిగాడని, తన గదికి తీసుకురమ్మని దీన్ దయాళ్ చెప్పడంతో అక్కడికి తీసుకువెళ్లారని పోలీసులు చెప్పారు. ఆ గదిలోనే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో నిషు మూడో నిందితుడని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ సంజీవ్ తొలుత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దీన్‌దయాళ్, నిషు దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వివరించారు.