Gorakhnath temple: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 'మహంత'గా ఉన్న ఆలయ పునరుద్ధరణకు రూ.6.5 కోట్లు!
- గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు
- ఆలయంలో సరస్సు, ఆవరణలో లైట్లు ఏర్పాటు
- వాటర్, మ్యూజిక్ ఫౌంటైన్‌లు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహంత (హెడ్)గా ఉన్న గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠం త్వరలో సరికొత్త రూపురేఖలు సంతరించుకోనుంది. ఈ ఆలయ పునరుద్ధణకు యూపీ పర్యాటక శాఖ రూ.6.5 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ముతో ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఆలయంలో సరస్సు, ఆవరణలో లైట్లు, సౌండ్ అండ్ లేజర్ షో తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వాటర్ ఫౌంటెన్ వాల్‌పై ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారత పురాణేతిహాసాలు, భారతీయ సంస్కృతిని కథల రూపంలో తెలియజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయంలో సౌకర్యాల ఏర్పాటు, ఆధునికీకరణకు అవసరమైన పరికరాలు, ఇంజినీర్లను ఫ్రాన్స్ నుంచి రప్పిస్తున్నారు. ఆలయంలో ఏర్పాటు చేస్తున్న లైటింగ్ వల్ల మఠం మీదుగా రాత్రివేళ ప్రయాణించే విమానాల నుంచి కూడా ఆలయం కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచే వాటర్, లేజర్ షో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఇంజినీర్లు రాత్రి పగలు కష్టపడుతున్నట్టు చెప్పారు. ఒక్క గోరఖ్‌నాథ్ ఆలయం మాత్రమే కాదని, రాష్ట్రంలోని ఇతర ముఖ్యమైన ఆలయాల్లోనూ ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తామని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి అవ్‌నీశ్ అవస్థి తెలిపారు.
మరోపక్క, ఆలయం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదని ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతున్నానని తెలిసే యోగి ప్రభుత్వం ఇటువంటివి చేస్తోందని విమర్శించింది.