Vijayawada: మారుతున్న బెజవాడ రాజకీయం... వైకాపాకు వంగవీటి కుటుంబీకుడు శ్రీనివాస ప్రసాద్ రాజీనామా!
- ఉయ్యూరు కౌన్సిలర్ గా ఉన్న శ్రీనివాస ప్రసాద్
- వైకాపా ఫ్లోర్ లీడర్ గానూ బాధ్యతలు
- పార్టీకి, పదవులకు రాజీనామా చేశానన్న శ్రీనివాస ప్రసాద్
బెజవాడ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి తనకు హామీ ఇవ్వలేదని వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తితో ఉండి, అనుచరులతో చర్చలు సాగిస్తున్న వేళ, వంగవీటి కుటుంబ సభ్యుడు శ్రీనివాస ప్రసాద్ వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను వైకాపా కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు.
ఆపై మీడియాతో మాట్లాడిన శ్రీనివాస ప్రసాద్, జగన్ వైఖరిని నిరసిస్తూ, పార్టీకి, పదవులకు రాజీనామా చేసినట్టు వెల్లడించారు. పార్టీలో కష్టపడుతున్న వారికి గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, శ్రీనివాస ప్రసాద్ ప్రస్తుతం ఉయ్యూరు కౌన్సిలర్ గా, వైకాపా మునిసిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. వైకాపాకు వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్న వేళ, శ్రీనివాస ప్రసాద్ ముందే రాజీనామా చేసి కలకలం సృష్టించడం గమనార్హం.