madras high court: పోలీసులపైన, మద్రాస్ హైకోర్టుపైన బండబూతులు.. బీజేపీ నేత రాజాపై కేసు నమోదు!

  • అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత
  • మసీదు ముందు వేదిక ఏర్పాటుకు యత్నం
  • పోలీసులు అడ్డుకోవడంతో తిట్లదండకం

తమిళనాడు బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి నిమజ్జన సందర్భంగా ఓ మసీదు ముందు వేదిక ఏర్పాటు చేసేందుకు పోలీసులు నో చెప్పడంతో రాజా నోటికి పనిచెప్పారు. వారిని బండబూతులు తిడుతూ అవినీతి పరులనీ, హిందూ వ్యతిరేకులని దుయ్యబట్టారు. వేదిక ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయస్థానం ఆదేశాలు ఉన్నాయని చెప్పగా, కోర్టుపై సైతం అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై 8 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రస్తుతం రాజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

పుదుకోట్టై జిల్లా మెయ్యపురంలో బీజేపీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల ఊరేగింపు శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మసీదు వద్ద వేదికను ఏర్పాటు చేయడానికి బీజేపీ నేతలు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజా తిట్లదండకం మొదలుపెట్టారు. పోలీసులు పచ్చి అవినీతిపరులుగా మారిపోయారనీ, ఎంత లంచం కావాలంటే అంత పడేస్తానని వ్యాఖ్యానించారు.
 
పోలీసులు మాత్రం 'ఇలా వేదికలు ఏర్పాటు చేయకూడదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను' రాజాకు చూపారు. దీంతో మరింత ఆగ్రహంతో ఊగిపోయిన రాజా.. ఏకంగా మద్రాస్ హైకోర్టునే దుర్భాషలాడుతూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినీ ప్రముఖులు సహా పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై పోలీసులు 8 సెక్షన్ల కింద రాజాపై కేసు నమోదు చేశారు. అయితే తన వ్యాఖ్యలను కొందరు ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారని రాజా ఆరోపించారు.

  • Loading...

More Telugu News