Anantapur District: తాడిపత్రిలోకి అడుగుపెట్టిన ‘ఆక్టోపస్’.. ఆశ్రమంలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా పోలీసులు!
- భారీగా పోలీసుల మోహరింపు
- రంగంలోకి అక్టోపస్ ను దించిన అధికారులు
- మరికాసేపట్లో ఆపరేషన్ మొదలు
తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమంలో ఉన్న భక్తులను బయటకు తెచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే వీరిని తరలించేందుకు పలు బస్సులను అందుబాటులోకి తెచ్చిన పోలీసులు తాజాగా ఉగ్రవాదులను ఏరివేసే ప్రత్యేక ఆక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దించారు. ప్రబోధానంద ఆశ్రమంలో ఉన్నవారి వద్ద ఆయుధాలు ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడకు 2,000 మందికిపైగా పోలీసులు చేరుకున్నారు. వీరితో పాటు ఆక్టోపస్ బలగాలు కూడా ఆశ్రమం వద్దకు వచ్చేశాయి. దీంతో ఎప్పుడైనా ఆపరేషన్ మొదలుకావొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు జేసీ సోదరులు అకారణంగా తమపై కక్ష కట్టారని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. తొలుత జేసీ వర్గీయులు తమపై దాడిచేసి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. భక్తుల ప్రాణాలను కాపాడటానికి జేసీ వర్గీయులను తాము అడ్డుకున్నామని స్పష్టం చేశారు. తమపై అకారణంగా దాడిచేశారని వాపోయారు. కాగా ప్రస్తుతం తాళం వేసుకుని ఆశ్రమం లోపల ఉండిపోయిన వారిని బయటకు తెచ్చేందుకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా పదుల సంఖ్యలో అంబులెన్సులను ఆశ్రమం వద్దకు తరలిస్తున్నారు. ఆపరేషన్ చేపట్టేందుకు ఆక్టోపస్ టీం కమ్యూనికేషన్, ఇతర వ్యవస్థలను సిద్ధం చేసుకుంటోంది.
ఈ విషయమై తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు కూర్చున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. వినాయక నిమజ్జనానికి వెళుతుండగా ప్రజలపై దాడిచేసిన ప్రబోధానంద వర్గీయులు స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు గాయపడ్డారని చెప్పారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించి, దోషులను అరెస్ట్ చేసేవరకూ తాను వెనక్కు తగ్గబోనని స్పష్టం చేశారు.
ప్రబోధానంద స్వామితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని జేసీ తేల్చిచెప్పారు. ఈ ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని మరోసారి ఆరోపించారు. కాగా, ఆపరేషన్ సందర్భంగా కాల్పులు జరిగే అవకాశం ఉందనీ, లోపల ఎవరివద్ద ఆయుధాలు ఉన్నాయో తమకు తెలియదని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. చర్చలకు జిల్లా ఎస్పీ ఆశ్రమంలోకి వెళ్లినప్పటికీ ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ఆశ్రమం ఖాళీ చేయాలన్న అధికారుల విజ్ఞప్తికి నిర్వాహకులు సానుకూలంగా స్పందించలేదని సమాచారం.