Vijayawada: విజయవాడ వైసీపీలో అలజడి.. ఆత్మహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు!
- అడ్డుకున్న వంగవీటి రాధా
- విజయవాడ సెంట్రల్ టికెట్ కోరిన నేత
- సాయంత్రం 5 గంటలవరకూ డెడ్ లైన్
వైఎస్సార్ కాంగ్రెస్ నేత వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ పై అధిష్ఠానం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు హల్ చల్ చేశారు. బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాధా మద్దతుదారులు ఇద్దరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. చివరికి వంగవీటి రాధా అక్కడకు చేరుకుని కార్యకర్తలను వారించి తన వెంట తీసుకెళ్లారు. నిన్న జరిగిన వైసీపీ ముఖ్యనేతల సమావేశం నుంచి రాధా కోపంగా బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రాధాకు మద్దతుగా ఆయన పెదనాన్న కొడుకు ఉయ్యూరు కౌన్సిలర్ శ్రీనివాస ప్రసాద్ పార్టీకి రాజీనామా సమర్పించి షాక్ ఇచ్చారు.
తాజాగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు పార్టీ అధిష్ఠానం స్పందించకుంటే తమ దారి తాము చూసుకుంటామని రాధా వర్గీయులు స్పష్టం చేశారు. 'గడప గడపకూ వైసీపీ' కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ లో నిర్వహించే బాధ్యతను పార్టీ అధిష్ఠానం మల్లాది విష్ణుకు కట్టబెట్టడంపై రాధా మనస్తాపం చెందారు. అంతేకాకుండా సమావేశంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి తీరుపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాధా, వంగవీటి రంగా అనుచరులు ఈ రోజు బందరు రోడ్డులో రంగా విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.