Anantapur District: తాడిపత్రిలో తగ్గిన ఉద్రిక్తత.. ప్రబోధానంద ఆశ్రమ వర్గీయులతో కలెక్టర్ చర్చలు సఫలం!
- 3 గంటలు చర్చలు జరిపిన కలెక్టర్
- స్వస్థలాలకు పయనమైన భక్తులు
- ఆధార్ కార్డులుంటేనే ఆశ్రమంలో ఉండాలన్న పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద ఉద్రిక్తతలు తగ్గాయి. ఆశ్రమ నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ మూడు గంటల పాటు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బయటివారిని స్వస్థలాలకు పంపేందుకు ఆశ్రమ నిర్వాహకులు అంగీకరించారు. దీంతో ఇప్పటికే అందుబాటులో ఉంచిన బస్సుల్లో భక్తులను అధికారులు తరలిస్తున్నారు. మిగిలినవారిని కూడా సొంత గ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చర్చల ప్రకారం కేవలం ఆధార్ కార్డు ఉన్నవారు మాత్రమే ఆశ్రమంలో ఉండేందుకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు.
రెండ్రోజుల క్రితం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులు, చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలో ఒకరు చనిపోగా, దాదాపు 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామస్తులకు మద్దతుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ధర్నాకు దిగడంతో టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ప్రబోధానంద వర్గీయులు వెనక్కి తగ్గకుంటే లోపలకు దూసుకెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం 2,000 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వీరపాండ్యన్ ఆశ్రమంలోని నిర్వాహకులను కలసి చర్చలు జరిపారు. చివరికి చర్చలు సఫలం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.