Karnataka: కేసుల కాపురం.. భార్యపై 59 కేసులు పెట్టిన భర్త.. ఎదురు కేసులు పెట్టిన భార్య.. సుప్రీం ఆగ్రహం!
- కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
- భార్యాభర్తల మధ్య కేసుల వార్
- ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
భార్యాభర్తలు అన్నాక గొడవలు తలెత్తడం సహజం. కొన్నిసార్లు ఇవి పెద్ద మనుషుల పంచాయితీతో తీరిపోతే.. మరికొన్ని సార్లు మాత్రం కోర్టు మెట్లు ఎక్కి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ జంట విషయంలో ఇలాంటి సమస్యే తలెత్తింది. భార్యాభర్తల మధ్య గొడవలు చిలికిచిలికి గాలివానగా మారడంతో ఒకరిపైమరొకరు డజన్ల కొద్దీ కేసులను పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది.
బెంగళూరుకు చెందిన ఓ టెక్కీకి 2002లో స్థానికంగా ఉండే యువతితో వివాహమైంది. పెళ్లి తర్వాత ఈ జంట ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిపోయింది. 2009లో వీరికి ఓ బాబు పుట్టాడు. అయితే భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఆమె పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. ఎంత బ్రతిమాలినా భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో ఆగ్రహించిన సదరు భర్త విడాకుల కోసం కోర్టులో కేసు దాఖలు చేశాడు. దీంతో అతనికి పోటీగా మహిళ కూడా విడాకులకు దరఖాస్తు చేసింది.
ఈ వివాదం అక్కడితో ఆగిపోలేదు. వేర్వేరు కారణాలు చెబుతూ సదరు భర్త తన భార్యపై ఏకంగా 59 కేసులు పెట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన యువతి అతనిపై 9 ఎదురు కేసులు పెట్టింది. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. దీంతో భార్యాభర్తలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తయ్యేదాకా భార్యాభర్తలు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కొత్త కేసులు పెట్టకుండా ఆంక్షలు విధించింది. ఇప్పటివరకూ పెండింగ్ లో ఉన్న కేసులను 6 నెలల్లోగా పరిష్కరించాలని దిగువ కోర్టులను ఆదేశించింది.