Special Category Status: కర్నూలు జిల్లాలో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య.. 'హోదా వచ్చుంటే అన్నకు ఉద్యోగం వచ్చేది' అని సూసైడ్ లేఖ!
- పదవ తరగతి చదువుతున్న మహేంద్ర
- అన్నకు ఉద్యోగం లేక కుటుంబంలో ఇబ్బందులు
- తన ఆవేదనను అక్షర రూపంలో పెట్టి తనువు చాలించిన మహేంద్ర
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో తీవ్ర కలకలం రేపింది. పదవ తరగతి చదువుతున్న మహేంద్ర అనే బాలుడు, తన అన్నకు ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతకుముందు సూసైడ్ లేఖ రాస్తూ, ప్రత్యేక హోదా వచ్చుంటే, తన అన్నకు ఉద్యోగం వచ్చుండేదని అభిప్రాయపడ్డాడు. హోదా రాని కారణంగానే, తన అన్న నిరుద్యోగిగా ఉన్నాడని, దీంతో కుటుంబం గడవటం కష్టమైందని, ఇంట్లో వారికి భారం కాకూడదని నిర్ణయించుకున్నానని తన ఆవేదనను అక్షర రూపంలో లిఖించి, తనువు చాలించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మహేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.