Mumbai: పోలీస్ కానిస్టేబుల్ దృష్టి మళ్లించి.. మహారాష్ట్ర సీఎం పీఏ పర్సు, ఫోన్ చోరీ!
- ముంబయిలో ఘటన
- సీఎం ఫడ్నవీస్ పీఏ నిధి వస్తువులు మాయం
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
సాధారణ వ్యక్తుల వస్తువులు చోరీ చేస్తే థ్రిల్ ఏముందని అనుకున్నారో ఏమో...సాక్షాత్తు ముఖ్యమంత్రి పీఏ కారుపైనే కన్నేశారు. ఆమె ఇలా షాపింగ్‌కు వెళ్లగానే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న కానిస్టేబుల్ దృష్టి మళ్లించి ఆమె సెల్‌ఫోన్, పర్సు మాయం చేశారు. ముంబయి నగరంలో ‘టక్ టక్ గ్యాంగ్’ ఈ చోరీకి పాల్పడి సంచలనం సృష్టించింది.
ఆ వివరాలలోకి వెళితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్ద నిధి కందార్ అనే యువతి పీఏగా పనిచేస్తోంది. కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తుండగా పోలీసు వాహనంలో నిధి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వచ్చారు. తిరిగి వెళ్తున్నప్పుడు వెస్ట్‌సైడ్ స్టోర్ వద్ద కారు ఆపించి షాపింగ్‌కు వెళ్లారు. ఆ సందర్భంగా కారులో తన పర్సు, ఫోన్ వదిలేశారు. డ్రైవింగ్ సీట్లో కానిస్టేబుల్ కూర్చున్నాడు.
కాసేపటికి టక్ టక్ గ్యాంగ్‌కు చెందిన ఓ సభ్యుడు డ్రైవింగ్ సీట్లో ఉన్న కానిస్టేబుల్ వద్దకు వచ్చాడు. మీ డబ్బు రోడ్డుపై పడిందని చెప్పాడు. దీంతో అతను కారు దిగగానే గ్యాంగ్‌లోని మరో వ్యక్తి కారులోని పర్సు, ఫోన్ ఎత్తుకెళ్లాడు. తిరిగి కారులోకి చూసిన డ్రైవర్ పర్సు, ఫోన్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారొచ్చేసరికే గ్యాంగ్ సభ్యులు మాయమయ్యారు. సీసీ టీవీ పుటేజీ సాయంతో దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.