varun tej: 'ఫిదా' సాంగుకి ఫిదా అయ్యారు .. అరుదైన రికార్డును అందించేశారు!
- ప్రేమకథా చిత్రంగా సందడి చేసిన 'ఫిదా'
- 'వచ్చిండే' పాటకి అనూహ్యమైన రెస్పాన్స్
- ఆనందాన్ని వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రాలలో 'ఫిదా' చెప్పుకోదగినదిగా నిలిచింది. అమెరికాలో పెరిగిన అబ్బాయిగా వరుణ్ తేజ్ .. తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిగా సాయిపల్లవి ఈ సినిమాలో నటించారు. వైవిధ్యభరితమైన ఈ ప్రేమకథా చిత్రం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమాలో "వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెటు యేసిండే గమ్మున కూసో నియ్యాడే .. కుదురుగా నిల్సోనియాడే" అనే పాట విశేషమైన జనాదరణ పొందింది. ఇప్పటికీ ఈ పాట స్టేజ్ షోలపైనా .. ఫంక్షన్స్ లోను వినిపిస్తూనే వుంది. యూట్యూబ్ లో ఈ పాటను ఇంతవరకూ 150 మిలియన్ల (15 కోట్లు) మందికి పైగా వీక్షించారంటూ, ఫేస్ బుక్ ద్వారా శేఖర్ కమ్ముల ఆనందాన్ని వ్యక్తం చేశారు. '150 మిలియన్ మార్క్ ను దాటిన తొలి తెలుగు పాట ఇదే .. అద్భుతమైన మీ స్పందనకు ధన్యవాదాలు .. ఈ మ్యాజిక్ లో భాగమైన 'ఫిదా' టీమ్ కి శుభాకాంక్షలు' అని ఆయన పోస్ట్ చేశారు.