Karnataka: బారులు తీరుతున్న కర్ణాటక సరిహద్దు ప్రాంతాల పెట్రోల్ బంకులు.. అక్కడే ట్యాంకులు పుల్ చేయించుకుంటున్న వైనం!
- వాహనదారులకు ఆశాదీపంగా కర్ణాటక
- తెలంగాణతో పోలిస్తే డీజిల్ ధరలో రూ.6 తేడా
- అక్కడే ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్న వాహనదారులు
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో బెంబేలెత్తుతున్న వాహనదారుల ఇక్కట్లు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గం లేక ధరలు ఎంత పెరుగుతున్నా వాహనాల్లో ఇంధనం నింపుకోక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కర్ణాటకకు, అక్కడి నుంచి తెలంగాణాకు నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు ఇప్పుడు కర్ణాటక ఆశాదీపంగా కనిపిస్తోంది. తెలంగాణలోని ఇంధన ధరలతో పోలిస్తే కర్ణాటకలో ఆరు రూపాయల వ్యత్యాసం ఉండడమే అందుకు కారణం.
తెలంగాణలో లీటరు డీజిల్ ధర సెప్టెంబర్ 18న రూ.80.35 ఉండగా, కర్ణాటకలో రూ.74.25 మాత్రమే. అంటే రూ.6.10 తేడా ఉందన్నమాట. లీటరుకు ఆరు రూపాయలు కలిసి వస్తుండడంతో వాహనదారులు కర్ణాటక బంకులకే మొగ్గు చూపుతున్నారు. కర్ణాటక సరిహద్దున ఉండే నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నుంచి కర్ణాటకకు రాకపోకలు సాగించే వాహనదారులు ఇప్పుడిదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ తరహా లారీలు, ప్రైవేటు బస్సులు అక్కడే ట్యాంకు ఫుల్ చేయించుకుని వస్తున్నాయి.