India: ఇండియాను ఓడించినంత పని చేసిన పసికూన హాంకాంగ్... బతుకుజీవుడా అనుకున్న అభిమానులు!

  • 285 పరుగులు చేసిన ఇండియా
  • భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన హాంకాంగ్ ఓపెనర్లు
  • చివరకు 26 పరుగుల తేడాతో భారత్ విజయం

పసికూన హాంకాంగ్ భారత్ ను గడగడలాడించింది. కాస్తంత ఆదమరిస్తే జరిగే పరిణామాన్ని కళ్లముందుంచింది. ప్రధాన ఆటగాళ్లను పక్కనబెట్టి బరిలోకి దిగితే, ఏం జరుగుతుందో చూపించింది. 34 ఓవర్లపాటు భారత క్రికెట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దాదాపు పరాభవం ఖాయమనుకున్న దశ నుంచి పుంజుకుని బతుకుజీవుడా అంటూ గెలిచింది. లేకుంటే భారత్ కు పరాభవం తప్పుండేది కాదు. దుబాయ్ లో జరుగుతున్న ఆసియాకప్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.

హాంకాంగ్ దృష్టిలో ఇది కొండంత లక్ష్యమే. కానీ, హాంకాంగ్‌ ఓపెనర్లు నిజాకత్, అన్షుమన్‌ లు, భారత బౌలింగ్‌ ను సమర్థనీయంగా ఎదుర్కున్నారు. మ్యాచ్ లో గెలిచినంత పని చేశారు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ, నిజాకత్ 92, అన్షుమన్ 73 పరుగులు చేశారు. ఈ దశలో ఖలీల్‌ అహ్మద్‌ పేస్, కుల్దీప్, చహల్‌ ల మణికట్టు మాయాజాలం ఇండియా పరువును కాపాడాయి. వీరిద్దరి జోడీ విడిపోయిన తరువాత, హాంకాంగ్ అట్టేసేపు నిలవలేకపోయింది. చివరికి 26 పరుగుల తేడాతో గెలిచిన ఇండియా ఊపిరి పీల్చుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే తదుపరి రౌండ్ కు అర్హత సాధించగా, రెండు మ్యాచ్ లు ఓడిన హాంకాంగ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సెంచరీతో ఆకట్టుకున్న శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఓడిపోతామని భావించిన ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించేసరికి, అభిమానులు బతుకుజీవుడా అని అనుకున్నారు. నేడు భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో గ్రూప్ దశలో రెండో మ్యాచ్ ఆడనుంది. 

  • Loading...

More Telugu News