Tejomurthy: "తిరుమలలో ఉన్నా... రూమ్ తీసుకున్నా... వచ్చేయ్"... యువతిని వేధించిన వాయల్పాడు సీఐ... చివరికి సస్పెన్షన్!
- ఓ కేసు నిమిత్తం వచ్చి పరిచయమైన బాధితురాలు
- ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని భావించిన తేజోమూర్తి
- పవిత్రమైన ఆలయ సన్నిధిని వాడుకోవాలని చూసిన 'కామమూర్తి'
అతనిపేరు తేజోమూర్తి... చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ. కామమూర్తిగా మారాడు. తన వద్దకు ఓ కేసు నిమిత్తం వచ్చిన మదనపల్లికి చెందిన సంయుక్త అనే యువతిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని చూశాడు. నిత్యమూ ఫోన్ కాల్స్ చేసి విసిగించాడు. తనను కలవాలని చెప్పి బలవంతం చేశాడు. ప్రస్తుతం తిరుమల బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహిస్తున్న ఇతగాడు, బాధితురాలికి విషయం చెప్పి, తన కామకలాపాలకు పవిత్రమైన ఆలయ సన్నిధినే వాడుకోవాలని చూశాడు.
తిరుమలలో ఉన్నానని, రూము కూడా తీసుకున్నానని ఆ యువతికి మెసేజ్ చేసి, ఓ బిడ్డకు తల్లని కూడా కనికరం లేకుండా, పాపను వదిలి తన వద్దకు వచ్చేయాలని హుకుం జారీ చేశాడు. ఏకాంతంగా గడిపేందుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇచ్చాడు. తనకు నాద నీరాజనం వద్ద డ్యూటీ వేశారని, తాను గదికి వచ్చిపోతూ ఉంటానని చెప్పాడు. నందకంలో ఇద్దరికీ కలిపి ఓ రూము తీసుకుని ఉంచానని అన్నాడు.
ఇక తేజోమూర్తి వేధింపులను భరించలేకపోయిన యువతి, మహిళా సంఘాల సాయంతో డీఐజీ శ్రీనివాస్ ను ఆశ్రయించింది. దీంతో వెంటనే స్పందించిన శ్రీనివాస్, తేజోమూర్తిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తేజోమూర్తిపై శాఖా పరమైన విచారణకు ఆదేశించారు. అతనిపై చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు.