Madhya Pradesh: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. 100 కుట్లు వేసిన వైద్యులు!
- మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఘటన
- పిల్లాడిపై విరుచుకుపడ్డ వీధి శునకాలు
- ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారి
ఓ చిన్నారిపై దాడిచేసిన వీధి కుక్కలు అతడిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ పిల్లాడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కవాయీ క్యాంపస్ గోకుల్ థామ్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ కాలనీకి చెందిన చిన్నారి(6) ఇంటి బయట ఆడుకుంటున్నాడు.
ఇంతలో అక్కడే వీధిలో ఉన్న ఏడు కుక్కలు ఒక్కసారిగా పిల్లాడిపై దాడిచేశాయి. కాళ్లు, చేతులు, ముఖం, వీపుపై కరిచి దాడిచేశాయి. ఇది గమనించిన స్థానికులు వాటిని తరిమేసి పిల్లాడిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స ప్రారంభించిన వైద్యులు.. చిన్నారి గాయాలకు 100కు పైగా కుట్లు వేశారు. తీవ్రంగా గాయపడ్డ పిల్లాడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.