Rafale jets: మీరు చెబుతున్నట్టు రాఫెల్ డీల్ చవకే అయితే.. 36 విమానాలే ఎందుకు కొంటున్నారు?: మోదీకి ఆంటోనీ సూటి ప్రశ్న
- రాఫెల్ డీల్ అత్యంత చవకన్న మోదీ ప్రభుత్వం
- అంత చవక అయితే 36 విమానాలే ఎందుకన్న ఆంటోనీ
- రాఫెల్ డీల్‌తో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన
మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న రాఫెల్ డీల్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ మరింత జోరు పెంచింది. రాఫెల్ డీల్‌తో జాతి భద్రతను ప్రధాని మోదీ ముప్పులో పడేశారంటూ రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ విరుచుకుపడ్డారు. దేశ రక్షణ విషయంలో మోదీ ప్రభుత్వం రాజీ పడిందని ఆరోపించారు. ఒకవేళ కేంద్రం చెబుతున్నట్టే రాఫెల్ యుద్ధ విమానాల డీల్ అత్యంత చవకే అయితే, కేవలం 36 విమానాలను మాత్రమే ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు.
తమకు 126 విమానాలు కావాలని ఆర్మీ 2000 సంవత్సరంలో చెప్పిందని పేర్కొన్న ఆంటోనీ.. వాటిని మరింత పెంచాల్సింది పోయి 36కు ఎందుకు కుదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం 126 విమానాల్లో 18 విమానాలను ‘ఫ్లై-ఎవే’ నిబంధనలో భాగంగా ఫ్రాన్స్ అందిస్తుందని, మిగతా 108 విమానాలను హిందూస్థాన్ ఏరో నాటిక్స్ (హెచ్ఏఎల్) తయారు చేయాల్సి ఉందన్నారు.
మోదీ ప్రభుత్వ రాఫెల్ డీల్ వల్ల వేలాది మంది టెక్నీషియన్లు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడతారని ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి, న్యాయశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి సహా ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వ ప్రతిపాదన కంటే రాఫెల్ డీల్ చాలా చవకని చెబుతున్నారని, అటువంటప్పుడు కేవలం 36 విమానాలు మాత్రమే ఎందుకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని ఆంటోనీ డిమాండ్ చేశారు.