Marriage: నా పెళ్లికి రూ.1.45 లక్షలు ఇవ్వకుంటే మిమ్మల్ని అన్‌ఫ్రెండ్ చేస్తా.. వైరల్ అవుతున్న యువతి పోస్టు!
- తన పెళ్లికి వచ్చేవారు రూ.1.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్
- తన ఆనంద క్షణాలను పంచుకునేందుకు ఆ మాత్రం ఇవ్వాల్సిందేనన్న వధువు
- క్షణాల్లోనే వైరల్ అయిన ఇన్విటేషన్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వధూవరులు తమ వెడ్డింగ్ కార్డులు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటున్నారు. ఏదో మొక్కుబడిగా కాకుండా పూర్తిగా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్పబోయేదీ అటువంటిదే కానీ వాటికంటే కొంచెం భిన్నం. థాయిలాండ్‌లోని ఓ వధువు తన పెళ్లికి ఫేస్బుక్ ఫ్రెండ్స్‌ను ఆహ్వానిస్తూ ఫేస్బుక్లో చేసిన పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇన్విటేషన్‌ను చూసిన వారికి గుండెనొప్పి వచ్చినంత పనైంది. పెళ్లికి హాజరయ్యే వారు 3 వేల డాలర్లు (దాదాపు రూ.2 లక్షలు) ఇవ్వాలని, లేకుంటే వారిని అన్‌ఫ్రెండ్ చేస్తానని అందులో హెచ్చరించింది. ఆమె ఈ పోస్టు చేసిన క్షణాల్లోనే అది వైరల్ అయింది. ప్రత్యేకమైన రోజును షేర్ చేసుకుంటున్నందుకు ఆ మొత్తం చెల్లించాల్సిందేనని పేర్కొన్న వధువు.. అంతమొత్తం చెల్లించడం కొంత కష్టమైనా తప్పదని తేల్చి చెప్పడం విశేషం.
అయితే, చివరి నిమిషంలో వెడ్డింగ్ లొకేషన్‌ను థాయిలాండ్ నుంచి హవాయికి మార్చుకుంటున్నామని చెప్పిన ఆమె, థాయిలాండ్‌తో పోలిస్తే అక్కడికి చాలా చవగ్గా వెళ్లొచ్చని, కాబట్టి వెయ్యి డాలర్లను తగ్గిస్తూ ఆఫర్ కూడా ఇచ్చింది. అంటే రూ.1.45 లక్షలన్న మాట. మా ఆనందాన్ని షేర్ చేసుకునేందుకు 2 వేల డాలర్లు ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించింది. అన్‌ఫ్రెండ్ చేస్తానని బెదిరించడంతో ఓ ఏడుగురు మాత్రం ఆమె వివాహానికి హాజరయ్యారు.