nxal rama: ‘మోదీ హత్యకు కుట్ర’ సమాచారం లేదు : లొంగిపోయిన నక్సల్ వెట్టి రామ
- మావోయిస్టు ఉద్యమం గ్రామాల నుంచి పట్టణాలకు విస్తరించింది
- ఎన్‌కౌంటర్ల తర్వాత వరవరరావు, కొందరు పట్టణ మావోయిస్టులు మాకు సహకరించేవారు
- 16 ఏళ్ల వయసులో ఉద్యమంలో చేరి 23 ఏళ్లు అడవుల్లో ఉన్నాను
ప్రధాని మోదీ హత్యకు నక్సల్స్ కుట్రపన్నారన్న అంశంపై తనకు ఎటువంటి సమాచారం లేదని లొంగిపోయిన నక్సలైట్ వెట్టి రామ ప్రకటించారు. అయితే ఎన్‌కౌంటర్ల తర్వాత మృతదేహాలు చనిపోయిన వారి బంధువులకు అందించడంలో వరవరరావు, మరికొందరు పట్టణ మావోయిస్టులు సహకరించేవారని తెలిపారు. బీమా కోరెగాం హింసలో పాత్రకు సంబంధించి వరవరరావు, అరుణ్‌ఫెరీరా, వెర్నాన్ గోంసాల్వేజ్, సుధాభరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖా అనే ఐదుగురు హక్కుల నేతలను గతనెల 29న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వీరిని గృహనిర్బంధంలో ఉంచారు. ఈ నేపథ్యంలో లొంగిపోయిన రామ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఉద్యమం గ్రామాల నుంచి పట్టణాలకు విస్తరించిందన్నారు. వరవరరావు, పలువురు పట్టణ మావోయిస్టులు ఎన్‌కౌంటర్ల సమయంలో సహకరిస్తున్నారని చెప్పడం గమనార్హం. 16 ఏళ్ల వయసులో తాను ఉద్యమంలో చేరానని, 23 ఏళ్లపాటు అడవుల్లో పనిచేశానని చెప్పారు.