Anantapur District: ప్రబోధానంద ఆశ్రమాన్ని ప్రారంభించింది దివాకర్ రెడ్డే!.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు
- 12 ఏళ్ల క్రితం జేసీ చేతుల మీదుగానే ప్రారంభం
- పుస్తకావిష్కరణలో పాల్గొన్న దివాకర్ రెడ్డి
- ఈరోజు సీఎంను కలసి ఫిర్యాదు చేసిన ఎంపీ
అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాడిపత్రి మండలం చిన్నపొడమలలో చెలరేగిన హింసపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రబోధానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయనీ, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దాదాపు 12 సంవత్సరాల క్రితం స్వయంగా జేసీ దివాకర్ రెడ్డే ఈ ఆశ్రమాన్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయి.
కేవలం ఆశ్రమాన్ని ప్రారంభించడమే కాకుండా ప్రబోధానంద స్వామి రాసిన ఓ పుస్తకాన్ని సైతం జేసీ ఆవిష్కరించిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ప్రబోధానందస్వామి కొడుకు యోగానంద చౌదరి ఇటీవల బీజేపీలో చేరడంతో వివాదం రాజుకుందని ప్రబోధానంద ఆశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసమే జేసీ సోదరులు ఆశ్రమంపై కక్ష కట్టారనీ, ఘర్షణలు రెచ్చగొట్టారని వెల్లడించాయి.