Andhrapradesh: ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు భేష్.. అవార్డులు కొల్లగొట్టిన హౌసింగ్, ఇంధన సంస్థలు!
- ప్రభుత్వ రంగ సంస్థలకు అవార్డుల పంట
- హౌసింగ్ కార్పొరేషన్‌కు అత్యధిక అవార్డులు
- ఇంధన రంగానికి పది
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుకు మెచ్చిన ‘స్కోచ్’ సంస్థ అవార్డులు ప్రకటించింది. వన్ నేషన్-వన్ ఫ్లాట్‌ఫాం నినాదంతో ఢిల్లీలో బుధవారం ‘స్కోచ్’ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసింది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంతోపాటు, ఈ రంగంలో పలు ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టినందుకు గాను హౌసింగ్ కార్పొరేషన్‌కు అత్యధికంగా 11 మెరిట్ అవార్డులతోపాటు మూడు గోల్డెన్ అవార్డులు, కార్పొరేట్ ఎక్స్‌లెన్స్ ప్లాటినం అవార్డు లభించాయి. ఇంధన రంగానికి పది అవార్డులు వచ్చాయి. హౌసింగ్ కార్పొరేషన్‌కు వచ్చిన బహుమతులను మంత్రి కాల్వ శ్రీనివాసులు అందుకున్నారు.
2018 సంవత్సరానికి గాను ఈ-మెజర్మెంట్ బుక్కు గాను ఏపీ ట్రాన్స్‌కోకు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణ చర్యలకు గాను ఇంధన సంరక్షణ మిషన్‌కు ఒక అవార్డు రాగా, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించినందుకు గాను నెడ్ క్యాప్‌కు 8 పురస్కారాలు దక్కాయి. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్, ఏపీ పౌర సరఫరాల సంస్థ, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్‌కు ఒక్కో అవార్డు దక్కాయి.