Rohit Sharma: పాక్‌పై భారత్ అలవోక విజయం!

  • చిరకాల ప్రత్యర్థిపై భారత్ ఘన విజయం
  • కెప్టెన్ రోహిత్ అర్ధ సెంచరీ
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ భువీ

ఆసియా కప్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అలవోక విజయం సాధించింది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్స్ ట్రోఫీ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. టీమిండియా బౌలర్ల దెబ్బకు 43.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్‌ను బాబర్ జమాన్ (47), షోయబ్ మాలిక్ (43) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, వారిద్దరూ అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్‌లు విజృంభించి వికెట్లు తీయడంతో పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. చివరల్లో ఫహీం అష్రఫ్ (21), మొహమ్మద్ ఆమిర్ (18)లు భారత బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయారు. దీంతో పాక్ 162 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, జస్ప్రిత్ బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీసుకున్నారు.

అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 29 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52) అర్ధ సెంచరీతో రెచ్చిపోగా, శిఖర్ ధవన్ (46) తృటిలో అర్ధ సెంచరీ మిస్సయ్యాడు.  అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ చెరో 31 పరుగులు చేసి భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించారు. మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. శుక్రవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య తర్వాతి మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News