Pranay: అమృత వర్షిణికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ. 8 లక్షలు!
- అమృతతో మాట్లాడిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏవీ రంగనాథ్
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని హామీ
- స్కూల్ భవనాన్ని ప్రణయ్ ట్రస్ట్ భవంతిగా మార్చాలని అమృత డిమాండ్
కన్నతండ్రి కుల దురహంకారానికి బలైన అమృత వర్షిణిని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏవీ రంగనాథ్ లు హామీ ఇచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులతో సమావేశమైన వారిరువురూ, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ. 8 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని వెల్లడించారు.
అమృత, ప్రణయ్ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? చదువు మధ్యలోనే ఎందుకు ఆపివేశారు? పెళ్లికి వచ్చిన అభ్యంతరాలు తదితరాంశాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, కేసు విచారణలో ఏ విధమైన సహాయం కావాలో చెప్పాలని అడిగారు. అరెస్టయిన వారికి బెయిల్ రాకుండా చూడాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అమృత కోరడంతో, అందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తన పేరిట ఉన్న అమృత జీనియస్ స్కూల్ భవనాన్ని ప్రణయ్ ట్రస్ట్ భవంతిగా మార్చాలని, తన తండ్రి ఆస్తులను ట్రస్టుకు చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అమృత డిమాండ్ చేసింది.