Andhra Pradesh: మీడియాపై బీజేపీ కార్యకర్త దాడి.. క్షమాపణలు చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ!
- కాకినాడలో బీజేపీ రైతు సదస్సులో ఘటన
- కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులు
- దురుసుగా ప్రవర్తించిన బీజేపీ కార్యకర్తలు
తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు బాబ్లీ డ్రామాను తెరపైకి తెచ్చారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ కేసులో 2015 నుంచి వారెంట్లు వస్తూనే ఉన్నా తాజాగా టీడీపీ నేతలు ఈ నెపాన్ని బీజేపీపై నెడుతున్నారని ఆరోపించారు. తన పలుకుబడితో చంద్రబాబు తనకుతానే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పించుకున్నారని అన్నారు. బుధవారం కాకినాడ సూర్యకళామందిరంలో జరిగిన రైతు సదస్సులో కన్నా మాట్లాడారు.
ఈ సందర్భంగా సదస్సులో పలువురు మాట్లాడుతుండగా.. కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులు కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలను కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన కొందరు ‘సీరియస్ గా సమావేశం జరుగుతుంటే మీ గొడవేంటి? ఇష్టముంటే ఉండండి. లేదంటే వెళ్లిపోండి’ అని వ్యాఖ్యానించారు. ఇంతలోనే మరో బీజేపీ కార్యకర్త ఓ విలేకరిపై దాడిచేశాడు. దీంతో విలేకరులు అక్కడే ఆందోళనకు దిగారు. దాడికి దిగిన సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కన్నా వెంటనే స్పందిస్తూ.. మీడియా ప్రతినిధులకు సభాముఖంగా క్షమాపణలు చెప్పారు.