Kerala nun: కేరళ నన్ రేప్ కేసు.. బిషప్‌ను ఏడు గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
- బుధవారం ఏడు గంటలపాటు విచారణ
- నేడు మరోసారి ఇంటరాగేషన్
- తాను అమాయకుడినన్న బిషప్
కేరళ నన్‌పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను పోలీసులు బుధవారం ఏడు గంటలపాటు విచారించారు. తిరిగి గురువారం కూడా విచారించనున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.సుభాష్ ఆధ్వర్యంలో 54 ఏళ్ల బిషప్‌ను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. తొలి ఇంటరాగేషన్ పూర్తయిందని, గురువారం ఉదయం 11 గంటలకు మరోమారు విచారిస్తామని కొట్టాయం ఎస్పీ హరి శంకర్ తెలిపారు. విచారణకు బిషప్ తమకు సహకరిస్తున్నట్టు చెప్పారు.
ముందస్తు బెయిలు కోసం మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించిన బిషప్ బుధవారం ప్రైవేటు కారులో క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు. కాగా, ఆయనను ఈ నెల 25 లోగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
2014-2016 మధ్య తనపై 13 సార్లు బిషప్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధిత నన్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనమైంది. ఆయనను అరెస్ట్ చేయాలంటూ నన్‌లు ఆందోళన చేపట్టారు. దీంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. కాగా, తనపై ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని బిషప్ ఆరోపిస్తున్నారు. తాను అమాయకుడినని విచారణ అనంతరం బిషప్ పేర్కొన్నారు.