Uttar Pradesh: యూపీని తగులుకున్న మాయదారి జ్వరం... ఇప్పటివరకూ 79 మంది మృతి!
- ఏ రకమైన జ్వరమో తేల్చలేకపోతున్న అధికారులు
- రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య
- ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన ప్రభుత్వం
ఒళ్ళంతా భగభగా మండుతూ ఉంటుంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే ఫలితం ఉండదు. అది ఏ రకమైన జ్వరమో వైద్యాధికారులు ఇంతవరకూ తేల్చలేకపోయారు. ఈ గుర్తు తెలియని జ్వరం యూపీని పట్టుకుని పీడిస్తుండగా, ఇప్పటివరకూ 79 మంది మరణించారు. యూపీలో జ్వర బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వ అధికారులు, ప్రజల్లో అవగాహన పెంచే నిమిత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జ్వరాల విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
కాగా, జ్వరాలతో బరేలీ ప్రాంతంలో 24 మంది, బదౌన్ లో 23 మంది, హర్దోయిలో 12 మంది, సీతాపూర్ లో 8 మంది, బహరైచ్ లో ఆరుగురు, ఫిలిబిత్ లో నలుగురు, షాజహాన్ పూర్ లో ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా మృతి చెందారా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. జ్వర బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక టీములను పంపుతున్నామని యూపీ ఆరోగ్య మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ వెల్లడించారు.