Telangana: ప్రచార కమిటీ నుంచి తప్పించడం కంటే చంచల్ గూడ జైలులో పెట్టినా బాగుండేది!: అధిష్ఠానంపై వీహెచ్ అసంతృప్తి
- కమిటీ నుంచి తప్పించడంపై వీహెచ్ ఆవేదన
- ప్రచారం కోసం వాహనం కూడా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడి
- ఇంట్లో కూర్చోబోనని స్పష్టీకరణ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రచార, మేనిఫెస్టో కమిటీలు నేతల మధ్య చిచ్చును రాజేశాయి. తాజాగా ప్రచార కమిటీలో తనకు చోటు కల్పించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ నుంచి తప్పించడం కంటే తనను చంచల్ గూడ జైలులో పెట్టినా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం కోసం తాను వాహనాన్ని సైతం సిద్ధం చేసుకున్నానని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో చాలామంది కోవర్టులు ఉన్నారని వీహెచ్, పార్టీలో చాలామందికి కేసీఆర్ తో లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. పార్టీ కోసం ప్రచారం చేయకుండా తాను ఇంట్లో సైలెంట్ గా కూర్చునే వ్యక్తిని కాదని వీహెచ్ స్పష్టం చేశారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా తనకు ప్రచార కమిటీలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారనీ, కాని అది నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ కు ఎవరెవరు కోవర్టులుగా ఉన్నారో త్వరలోనే బయటపెడతానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో వీహెచ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.