cpec: ఎకనామిక్ కారిడార్ ను వ్యతిరేకిస్తున్న వారు ఎప్పటికీ గెలవలేరు: పాకిస్థాన్ తో చైనా అధ్యక్షుడు
- శాంతి, అభివృద్ధి కోసమే సీపీఈసీ అన్న జిన్ పింగ్
- సీపీఈసీని పాక్ సైన్యం కాపాడుతుంది
- పాక్ మాకు వ్యూహాత్మక భాగస్వామి
ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసమే తాము చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ), బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (ఆర్బీఐ) ప్రాజక్టులను చేపట్టామని చైనా అధినేత జిన్ పింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న వారు ఎప్పటికీ గెలవలేరని చెప్పారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. సమావేశంలో జిన్ పింగ్ మాట్లాడుతూ తమ ప్రాజెక్టులను ఎవరూ అడ్డుకోలేరనే విధంగా వ్యాఖ్యానించారు. ఎకనామిక్ కారిడార్ ను భారత్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా ఈ కారిడార్ వెళ్తున్న నేపథ్యంలో, భారత్ నిరసన వ్యక్తం చేస్తోంది.
జిన్ పింగ్ తో సమావేశం అనంతరం బజ్వా మాట్లాడుతూ, శాంతి కోసం తాము పని చేస్తున్న నేపథ్యంలో, వ్యతిరేక శక్తులను దీటుగా ఎదుర్కోవాల్సి ఉందని చెప్పారు. తమకు చైనా ఇస్తున్న సహకారం చాలా గొప్పదని అన్నారు. బజ్వాతో సమావేశం సందర్భంగా, 'పాకిస్థాన్ తమకు ఎప్పుడూ ఒక వ్యూహాత్మక భాగస్వామి' అని జిన్ పింగ్ చెప్పినట్టు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. సీపీఈసీని పాక్ సైన్యం కాపాడుతుందని అన్నట్టు పేర్కొంది.