komatireddy venkatareddy: నల్గొండ నుంచే కేసీఆర్ పతనం మొదలు.. సీట్ల సర్దుబాటుల్లో ఇబ్బందులు ఉండవు: కోమటిరెడ్డి
- ప్రజలను కేసీఆర్ నిలువునా మోసం చేశారు
- కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ ది కాదు
- రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం దగ్గర నుంచి వంద హామీలను కేసీఆర్ ఇచ్చారని... ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ బానిసలుగా చూశారని విమర్శించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పతనం నల్గొండ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని... ఆ ప్రభుత్వంలో తాను కీలక పదవిలో ఉంటానని తెలిపారు. నల్గొండలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా నియమించినందుకు తమ అధినేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నానని కోమటిరెడ్డి అన్నారు. తనపై ఉన్న నమ్మకంతోనే ఈ పదవిని కట్టబెట్టారని చెప్పారు. ప్రజా మేనిఫెస్టోను రూపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించి మేనిఫెస్టోను రూపొందిస్తామని అన్నారు. మహాకూటమి వల్ల సీట్ల సర్దుబాటులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని... గెలిచే అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు.