Sachin Tendulkar: డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన విశ్వవిద్యాలయం.. నో చెప్పిన సచిన్ టెండూల్కర్!
- డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అందించేందుకు జేయూ నిర్ణయం
- సున్నితంగా తిరస్కరించిన క్రికెట్ గాడ్
- గతంలోనూ డాక్టరేట్ తీసుకునేందుకు విముఖత
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆటలోనే కాదు సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా ఉంటాడు. రాజ్యసభ సభ్యుడిగా గ్రామాలను దత్తత తీసుకున్నా, స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నా సచిన్ స్టెయిల్ ఎప్పుడూ విభిన్నమే. తాజాగా ఆటతో పాటు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న సచిన్ కు గౌరవ డాక్టరేట్ అందించేందుకు ఓ విశ్వవిద్యాలయం ముందుకు రాగా, ఆ ప్రతిపాదనను సచిన్ సున్నితంగా తిరస్కరించాడు.
ఈ ఏడాది డిసెంబర్ 24న జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం(జేయూ)లో 63వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో సచిన్ కు గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ను అందించాలని వర్సిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయం వర్గాలు సచిన్ కు తెలపగా, ఆయన నిరాకరించారు. ఈ విషయమై జేయూ వైస్ ఛాన్స్ లర్ సురంజన్ దాస్ మాట్లాడుతూ.. నైతిక కారణాల దృష్ట్యా సచిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చాలాకాలంగా ఇలాంటివాటికి సచిన్ దూరంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి అవార్డులు తీసుకోవడం నైతికంగా తప్పని టెండూల్కర్ భావిస్తున్నట్లు సురంజన్ దాస్ పేర్కొన్నారు.
దీంతో ఈ సారి ప్రముఖ బాక్సర్ మేరీకోమ్‌కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయాలని గవర్నర్, వర్సిటీ ఛాన్స్ లర్ కేసరీనాథ్ త్రిపాఠి నిర్ణయించారు. మేరీ కోమ్ తో పాటు ప్రముఖ హెమటాలజిస్ట్ డా.మమ్మెన్ చాందీ, ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు, బ్యాంకింగ్ రంగ నిపుణుడు చంద్ర శేఖర్ ఘోష్‌లు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. వీరితో పాటు జీవశాస్త్ర వేత్త దీపాంకర్ ఛటర్జీకి డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను ఇవ్వనున్నారు. సచిన్ ఇలాంటి పురస్కారాలను తిరస్కరించడం ఇదే తొలిసారి కాదు. 2011లోనూ ఆయన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇవ్వాలనుకున్న డాక్టరేట్‌ను సున్నితంగా తిరస్కరించారు.