Nellore: నేటి నుంచి రొట్టెల పండగ... విదేశీ, సంతాన రొట్టెలకు ఫుల్ డిమాండ్!
- నేటి నుంచి నెల్లూరులో మొదలు
- ముస్తాబైన బారా షాహిద్ దర్గా
- లక్షలాదిగా చేరుకున్న భక్తులు
నెల్లూరులోని ప్రతిష్ఠాత్మక బారా షాహిద్ దర్గాలో నేటి నుంచి రొట్టెల పండగ మతాలకు అతీతంగా వైభవంగా జరగనుంది. ఇప్పటికే నెల్లూరు పట్టణం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వర్ణాల చెరువు నుంచి, పొదలకూరు నుంచి దర్గాకు వెళ్లే మార్గం భక్తులతో నిండిపోయింది. దర్గాను దర్శించుకుని, అమరులకు నివాళులు అర్పించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తమ కోరికలు తీరాలని కొందరు, కోరిన కోర్కెలు తీరినందున మరికొందరు మొక్కులు తీర్చుకునేందుకు రొట్టెలను మార్చుకోవడానికి పోటీ పడుతున్నారు.
ఈ ఏడాది, విదేశీ సంతాన రొట్టెలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. విదేశాలకు వెళ్లాలని భావించే యువత, ఉత్సాహంగా విదేశీ రొట్టెలను మార్చుకునేందుకు వాకబు చేస్తోంది. ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వారి గురించి వేల సంఖ్యలో యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. విదేశీయానం చేసి వచ్చిన వారు, మొక్కు తీర్చుకుంటూ ఇచ్చే రొట్టెను స్వీకరించేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. విదేశీ రొట్టెతో పాటు సంతాన, ఉద్యోగ రొట్టెలకు కూడా ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది.
కాగా, తాము కోరుకున్న కోరికలు తీరిన తరువాత, దర్గాకు వచ్చే భక్తులు, అదే కోరికలతో వచ్చే భక్తులతో రొట్టెలను మార్చుకోవడం ఆనవాయతీ అన్న సంగతి తెలిసిందే. వ్యాపారం, ఆరోగ్యం, ఉద్యోగం, ఉన్నత విద్య, వివాహం తదితర సంప్రదాయ రొట్టెలు ప్రతియేటా కనిపిస్తుంటాయి. ఇక ఎన్నికలు దగ్గరికి పడుతుండటం, లక్షల సంఖ్యలో ప్రజలు ఒకే చోటకు చేరే పరిస్థితి ఉండటంతో, రాజకీయ నాయకులు, ప్రజాసేవ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే, దర్గాకు వెళ్లే మార్గాల్లో టెంట్లు, గుడారాలు వేసి భక్తులకు మంచినీరు, మజ్జిగ తదితరాలను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలు గత సంవత్సరంలో మాదిరిగానే అభివృద్ధి రొట్టెలను, అమరావతి రొట్టెలను పంచుతున్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.