Apple: ప్రతిభకు ‘ఆపిల్’ పట్టం.. తిరుపతి వాసికి రూ.1.67 కోట్ల వేతనంతో ఉద్యోగం
- కంపెనీలో శాస్త్రవేత్తగా ఆంధ్రుడికి అవకాశం
- బెంగళూరులో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసిన రవితేజ
- న్యూయార్క్ ఎన్వైయూ వర్సిటీలో ఎంఎస్ పూర్తి
అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘ఆపిల్’ కంపెనీలో తిరుపతి యువకుడు అత్యున్నత ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. ప్రతిభకు పెద్దపీట వేసే ‘ఆపిల్’ రవితేజ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఏకంగా రూ.1.67 కోట్ల రూపాయల వార్షిక వేతనంపై శాస్త్రవేత్త ఉద్యోగానికి ఎంపిక చేసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారి పల్లెకు చెందిన రవితేజ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అతని తల్లిదండ్రులు నీలిమ, రమేష్నాయుడులకు వ్యవసాయమే జీవనాధారం.
ఇంటర్ వరకు తిరుపతిలో చదివిన రవితేజ బెంగళూరులో బీటెక్, న్యూయార్క్ ఎన్వైయూ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రతిభకు శ్రమను జోడిస్తే ఉన్నత స్థానం దానంతట అదే దక్కుతుందని నిరూపించిన రవితేజ ఈ తరం యువతకు ఆదర్శనీయుడు. రవితేజ అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివేందుకు వందశాతం ఉపకార వేతనంపై సీటు సాధించడం మరో విశేషం.