jd diwakar reddy: ఖాకీ బట్టలు వదిలేసి రా.. నీ సంగతేందో చూస్తా: సీఐకు జేసీ వార్నింగ్
- నన్నే హెచ్చరించే అంత మగాడివా?
- 25 వరకు ఇక్కడే ఉంటా.. ఏం చేసుకుంటావో చేసుకో
- నీది నిజమైన మీసమే అయితే ఎప్పుడొస్తావో చెప్పు
నాలుక కోస్తానంటూ హెచ్చరించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ మాధవ్ పై అనంతపురం టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేమైనా సాయికుమార్ సినిమానా మీసాలు తిప్పడానికని సీఐని ఉద్దేశించి జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్ వేరు, సినిమాలు వేరని చెప్పారు. నన్నే హెచ్చరించే అంత మగాడివా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంటికి రావాలా? మీ పోలీస్ స్టేషన్ కు రావాలా? అనంతపూర్ క్లాక్ టవర్ వద్దకు రావాలా? లేదా మీ ఊరికి రావాలా? చెప్పు? అంటూ సవాల్ విసిరారు. 'నాలుకే కోయాలనుకుంటే వచ్చి కోసేయ్... నీ కత్తి ఎంత పదునుగా ఉందో చూస్తా' అన్నారు.
ప్రబోధానంద అనుచరులనే ఏమీ చేయలేకపోయావ్... నా దగ్గరకు వస్తావా? అంటూ జేసీ ప్రశ్నించారు. 'నువ్వు ఖాకీ బట్టలు వదిలేసి రా... నేను కూడా ఈ బట్టలు వదిలేసి మామూలు బట్టలతో వస్తా... నీ సంగతేందో చూస్తా' అంటూ హెచ్చరించారు. నీది నిజమైన మీసమే అయితే ఎప్పుడొస్తావో చెప్పు అంటూ సవాల్ విసిరారు. 25వ తేదీ వరకు తాను ఇక్కడే ఉంటానని... ఏం చేస్తావో చేసుకో అంటూ ఛాలెంజ్ చేశారు. ఈలోగా కత్తికి బాగా పదును పెట్టుకో అన్నారు.
రాజకీయ నాయకులకు కూడా బుద్ధి రావాలని... అందరికీ సంఘాలు ఉన్నప్పుడు, రాజకీయ నాయకులకు మాత్రం సంఘాలు లేవని జేసీ చెప్పారు. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సంఘమే లేదని... వీళ్లకు వీళ్లే పెట్టుకుని ఉంటారని అన్నారు. ఆరు నెలల తర్వాత రాజకీయాల నుంచి తాను విరమించుకోవాలనుకుంటున్నానని... కానీ మళ్లీ ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి అని చాలా మంది కోరుతున్నారని అన్నారు.