america: చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోండి.. లేకపోతే తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొంటారు: అమెరికాకు చైనా వార్నింగ్
- మా మిలిటరీపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తి వేయండి
- అమెరికా చర్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి
- అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
తమ మిలిటరీపై కఠినమైన ఆంక్షలను విధించిన అమెరికాపై చైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రష్యా నుంచి సుఖోయ్ ఫైటర్ జెట్స్, ఎస్-400 మిస్సైల్ సిస్టంను కొనుగోలు చేసిన చైనా మిలిటరీపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ మీడియాతో మాట్లాడుతూ, తమ మిలిటరీపై అమెరికా తప్పుడు కారణాలతో, ఏకపక్షంగా విధించిన ఆంక్షలను ఖండిస్తున్నామని చెప్పారు. అమెరికా చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నామని తెలిపారు.
అంతర్జాతీయ సంబంధాలకు అమెరికా చర్యలు తీవ్ర విఘాతాన్ని కలిగించాయని జెంగ్ అన్నారు. ఇరు దేశాలు, ఇరు దేశాల మిలిటరీల మధ్య ఉన్న సంబంధాలు అమెరికా తీరుతో దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. తమ మిలిటరీపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని, చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.