Telangana: ప్రణయ్ హత్య ఎఫెక్ట్: ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.. ఫిర్యాదులు స్వీకరించండి: పోలీసులకు మార్గదర్శకాలు
- ప్రణయ్ హత్య తర్వాత పోలీస్ స్టేషన్లకు ప్రేమ జంటల క్యూ
- రోజుకు 15 వరకు ఫిర్యాదులు
- ఉదాసీనంగా ఉండొద్దంటూ పోలీసు శాఖ హెచ్చరిక
తెలంగాణలో వరుసపెట్టి జరుగుతున్న పరువు హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రేమికులు వచ్చి ఆశ్రయం కోరితే కల్పించాలని, వారు మేజర్లు అయితే ఫిర్యాదులు స్వీకరించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు పోలీసు శాఖ మార్గదర్శకాలు పంపింది. ఈ విషయంలో నిర్లక్ష్యం కూడదని, పరిస్థితి చేయిదాటనివ్వొద్దని సూచించింది.
ప్రేమికులు కనుక మేజర్లు అయితే వెంటనే ఫిర్యాదు తీసుకోవాలని, వారు ఆరోపించిన అంశాలపై దర్యాప్తు జరపాలని పోలీసు శాఖ తన ఆదేశాల్లో సూచించింది. అలాగే, ఇరు కుటుంబాల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించింది. గతంలోలా ఉదాసీనంగా వ్యవహరించవద్దని, అవసరమనుకుంటే కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశించింది. ప్రేమికులకు నిజంగానే ప్రాణహాని ఉందని భావిస్తే నిఘా పెట్టాలని పేర్కొంది. కాగా, ప్రణయ్ హత్య తర్వాత ప్రేమికుల ఫిర్యాదులు పెరిగాయని పోలీసు శాఖ తెలిపింది. జిల్లాలతోపాటు రాజధాని కమిషనరేట్ల పరిధిలో రోజుకు 10 నుంచి 15 ప్రేమ పెళ్లి ఫిర్యాదులు వస్తున్నట్టు పేర్కొంది.