kidnap: ఇది ‘పరువు కిడ్నాప్’.. తన కూతుర్ని ప్రేమించిన యువకుడిని కిడ్నాప్ చేసిన తండ్రి!
- విజయవాడలో అమ్మాయి కుటుంబీకుల యత్నం
- వెంటనే స్పందించి అడ్డుకున్న పోలీసులు
- 9 మందిని అరెస్ట్ చేసిన అధికారులు
తన కుమార్తెను ప్రేమించడంతో పాటు ఆమె ఇంట్లో నుంచి పారిపోవడానికి కారణమైన యువకుడిపై ఓ తండ్రి కోపంతో రగిలిపోయాడు. పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే పోలీస్ అధికారులు సరైన సమయానికి స్పందించడంతో ఆ ప్లాన్ ఫలించలేదు. దీంతో కిడ్నాప్ కు యత్నించిన దుండగులను పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఈ నెల 16న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నగరంలోని చుట్టుగుంటకు చెందిన ఓ యువకుడు(18), ప్రసాదంపాడుకు చెందిన యువతి(17) గతంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం యువకుడు పాలిటెక్నిక్, యువతి ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ విషయం ఇరువురి ఇళ్లలో తెలియడంతో ఇలాంటివి మానుకుని చదువుకోవాలని సూచించారు. అబ్బాయి తండ్రి అతని సిమ్ కార్డును తీసేశాడు. దీంతో అమ్మాయి ఫోన్ చేసేందుకు పలుమార్లు యత్నించినా వీలుకాలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన యువతి ఈ నెల 16న తల్లితో కలసి బయటకు వచ్చినప్పుడు తప్పించుకుని పారిపోయింది.
దీంతో అబ్బాయి తండ్రికి ఫోన్ చేసిన యువతి తండ్రి.. ‘మీ అబ్బాయే మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు’ అని ఆరోపించాడు. దీంతో అతనికి సర్ది చెప్పిన యువకుడి తండ్రి ఫోన్ లో సిమ్ కార్డు వేయగానే అమ్మాయి కాల్ చేసింది. ఎక్కడున్నావ్? అని ప్రశ్నించగా.. దుర్గగుడి వద్ద ఉన్నట్లు చెప్పింది. రాజీవ్ గాంధీ పార్క్ వద్దకు రావాల్సిందిగా అమ్మాయికి సూచించి ఆ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేశారు. అనంతరం కుమారుడు, అతని స్నేహితులతో కలసి సదరు తండ్రి అక్కడకు చేరుకున్నాడు.
కొద్దిసేపటికే మరికొందరితో కలిసి అక్కడకు చేరుకున్న అమ్మాయి బంధువులు.. యువకుడి తండ్రి, స్నేహితులతో వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అనంతరం అమ్మాయి తండ్రి ఆ యువకుడు, అతని స్నేహితుడిని కారులో ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో యువకుడి తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. నేతాజీ వంతెన సమీపంలో కారును అడ్డుకున్నారు. అనంతరం కిడ్నాప్ కు యత్నించినందుకు యువతి తండ్రి సహా 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 8 మందిని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. ప్రేమికులిద్దరూ మైనర్లు కావడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచామని పోలీసులు చెబుతున్నారు.