Telangana: పదవిలో ఉన్నా లేకున్నా నా జీవితం సిద్ధిపేట ప్రజలకే అంకితం!: మంత్రి హరీష్రావు
- జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామం సందర్శన
- వర్షాన్ని లెక్కచేయకుండా ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు
- మీ అభిమానం చూస్తుంటే ఈ జన్మకిది చాలని ఉద్వేగ ప్రసంగం
‘ప్రజల అభిమానానికి మించిన పదవేదీ ఉండదు. మీ అభిమానం చూస్తుంటే ఈ జన్మకిది చాలు అన్నంత ఆనందంగా ఉంది’ అని తెలంగాణ మంత్రి హరీష్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన మంత్రికి అక్కడి ప్రజలు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఘన స్వాగతం పలికారు.
బోనాలు, బతుకమ్మ, కులవృత్తుల సంపద్రాయాలతో సందడి చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ఉద్వేగంగా ప్రసంగించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అక్కున చేర్చుకున్న సిద్ధిపేట ప్రజల్లో ఇప్పటికీ అంతకు మించిన అభిమానం చూస్తుంటే తన జన్మ ధన్యమైందనిపిస్తోందన్నారు. ఓ రాజకీయ నాయకునికి ప్రజల గుండెల్లో లభించిన ఈ పదవి కంటే మించింది ఏముంటుందన్నారు.
'మీ అభిమానాన్ని చూస్తుంటే నా రాజకీయ పదవీ విరమణకు ఇదే మంచి సమయం ఏమో అని అనిపిస్తోంది' అని అన్నారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటానని, పదవి ఉన్నా లేకపోయినా తన జీవితం మీ సేవకే అంకితమని ప్రకటించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో కలిపేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని కాంగ్రెస్ వ్యూహకర్త గులాంనబీ అజాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘తెలంగాణ రాష్ట్రం ప్రజలు పోరాడి సాధించుకున్న సౌధం. వారి త్యాగాలే ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేలా ఒత్తిడి తెచ్చాయి. ఇందులో కాంగ్రెస్ గొప్పతనం ఏమీ లేదు’ అని అన్నారు. నిజంగా కాంగ్రెస్కు తెలంగాణ ఇవ్వాలన్నఅభిప్రాయమే ఉంటే 1969లో 369 మంది త్యాగాలు చేసిన సమయంలో ఏం చేసిందని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్కు కుర్చీ యావ తప్ప ప్రజా మనోభావాలు పట్టవని ఎద్దేవా చేశారు.