Narendra Modi: జీవితంలో యుద్ధ విమానాలు తయారుచేయని అంబానీకి మోదీ రూ.30,000 కోట్లు దోచిపెట్టారు!: రాహుల్ గాంధీ
- ఫైటర్ జెట్ల తయారీపై నిర్మల అబద్ధం చెప్పారు
- మోదీ స్వయంగా ఫ్రాన్స్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు
- ప్రజల నమ్మకాన్ని ప్రధాని వమ్ముచేశారు
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వం ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలుకు రూ.500 కోట్లు చెల్లిస్తే.. మోదీ మాత్రం తన స్నేహితుడు అనిల్ అంబానీ జేబు నింపేందుకు ఒక్కో ఫైటర్ జెట్ ను రూ.1,600 కోట్లకు కొంటున్నారని ఆరోపించారు. ఈ విషయం ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే వ్యాఖ్యలతో తేటతెల్లమయిందని వెల్లడించారు.
ఒప్పందం కుదుర్చుకోవడానికి 10 రోజుల ముందు అనిల్ అంబానీ కంపెనీని ఏర్పాటు చేశారన్నారు. హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ కు యుద్ధ విమానాలు తయారుచేసే సత్తా లేదని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారనీ, కానీ 'హాల్' డైరెక్టర్ మాత్రం దాన్ని ఖండించారని తెలిపారు. అసలు ఎవరిని రక్షించడానికి ప్రధాని మోదీ, ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ ప్రశ్నించారు.
రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు స్వయంగా మోదీ ఫ్రాన్స్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, రక్షణ మంత్రికి దీంట్లో సంబంధం లేదని రాహుల్ అన్నారు. మోదీ స్వయంగా రూ.30,000 కోట్ల విలువైన రాఫెల్ కాంట్రాక్టును అనిల్ అంబానీ చేతుల్లో పెట్టారని రాహుల్ విమర్శించారు. అనిల్ అంబానీ జీవితంలో ఇప్పటివరకూ యుద్ధ విమానాలను తయారుచేయలేదనీ, ఆయన పేరుపై ఇప్పటికే రూ.45,000 కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ దేశంలోని సామాన్యులు, ఆర్మీ, యువకుల జేబుల నుంచి తీసిన రూ.30,000 కోట్లను అంబానీ జేబులో కుక్కారని ఆరోపించారు. దేశ ప్రజలు నమ్మి ఓటేసిన వ్యక్తే(మోదీ) వారి నమ్మకాన్ని వమ్ము చేశారని రాహుల్ విమర్శించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చేసిన వ్యాఖ్యలపై మోదీ ఇప్పటివరకూ నోరు మెదపలేదని విమర్శించారు. రాఫెల్ కొనుగోలులో భారీ కుంభకోణం చోటుచేసుకుందనీ, ఈ ఘటనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.