rss: దీనదయాళ్ ఉపాధ్యాయ మృతి కేసుపై విచారణకు కేంద్రం ఆదేశాలు
- రంగంలోకి దిగిన యూపీ సర్కార్
- 1968లో దీనదయాళ్ అనుమానాస్పద మృతి
- అప్పటి నుంచి ఆయన మృతిపై పలు అనుమానాలు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంత కర్త దీనదయాళ్ ఉపాధ్యాయ మరణించి సుమారు యాభై ఏళ్లు అవుతుంది. 1968 సెప్టెంబరు 25న మొఘల్ సరాయ్ రైల్వేస్టేషన్ ట్రాక్ పై దీనదయాళ్ ఉపాధ్యాయ మృతదేహం దొరికింది. ఆయన మృతిపై అనుమానాలు ఇంకా అలానే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ కి చెందిన బీజేపీ కార్యకర్త రాకేశ్ గుప్తా దీనదయాళ్ ఈ మృతి రహస్యాన్ని ఛేదించాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు గత ఏడాది ఓ లేఖ రాశారు. దీనదయాళ్ మృతి వెనుక పెద్ద కుట్ర ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై విచారణ జరిపించాలని యూపీ సర్కార్ ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది.
ఈ ఆదేశాల నేపథ్యంలో దీనదయాళ్ మరణానికి సంబంధించిన ఫైల్ ను సమర్పించాల్సిందిగా రైల్వే శాఖకు చెందిన అలహాబాద్ ఎస్పీని యోగి సర్కార్ ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, కేసు డైరీ తదితర డాక్యుమెంట్లన్నీ మిస్సయ్యాయని సదరు ఎస్పీ తెలిపినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఓ డాక్యుమెంట్ ద్వారా కొన్ని విషయాలు తెలిశాయి. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారని, వారికి నాలుగేళ్ల జైలు శిక్ష పడినట్టు ఆ డాక్యుమెంట్ లో ఉంది. దీనదయాళ్ మృతి కేసును ఛేదించేందుకు సీబీఐని రంగంలోకి దింపాలని యోగి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.