Chandrababu: విమానం ఎక్కేలోపు చంద్రబాబుకు వచ్చిన ఆహ్వానాన్ని బయటపెట్టాలి: జీవీఎల్ డిమాండ్
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్ లో జరిగే ప్రసంగమిది
- అలాంటిది ఐక్యరాజ్యసమితిలో ప్రసంగమంటారా?
- అబద్ధపు ప్రచారాలతో సాధించేదేమిటి?
సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అలాగే, వివిధ వ్యాపారవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అమెరికా యాత్ర ఎవరి కోసం చేస్తున్నారని, డప్పుకొట్టుకోవడానికే తప్ప, ఈ పర్యటనతో ఏమన్నా ఫలితం ఉంటుందా అని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం వచ్చిందని చెప్పుకునే చంద్రబాబు, ఆ ఆహ్వానాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్ లో జరిగే ప్రసంగాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి చౌకబారు వ్యవహారాలను ఏపీ ప్రభుత్వం మానుకోవాలని, అబద్ధపు ప్రచారాలతో సాధించేదేమిటని ప్రశ్నించారు. అమెరికా పర్యటన నిమిత్తం విమానం ఎక్కేలోపు చంద్రబాబుకు వచ్చిన ఆహ్వానాన్ని బయటపెట్టాలని, ఈ బిల్డప్ లను పక్కనబెట్టి రాష్ట్రంలో పాలనపై దృష్టి సారించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో నాలుగేళ్లు మొద్దు నిద్రపోయారని, ప్రకాశం జిల్లాకు చంద్రబాబు వ్యతిరేకమన్న విషయం అక్కడి ప్రజలకు ఈపాటికే అర్థమైందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కాగ్ నివేదికకు ఏపీ ప్రభుత్వం సమాధానమివ్వలేదని జీవీఎల్ ఆరోపించారు.