Tamil Nadu: తమిళనాడు సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. తెల్లవారు జామున నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఓ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ కరుణాస్‌పై కేసు
- తెల్లవారుజామున 5 గంటలకు అదుపులోకి
- తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదన్న ఎమ్మెల్యే
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు, తిరువదానై ఎమ్మెల్యే కరుణాస్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సాలిగ్రామంలోని ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు కరుణాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కరుణాస్ చెన్నైలో ఇటీవల ప్రసంగిస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగం క్షణాల్లోనే వైరల్ అయింది. సీఎం, డిప్యూటీ సీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఈ నెల 20న కరుణాస్‌పై కేసు నమోదైంది. దీంతో ఆయన పరారైనట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, శుక్రవారం అకస్మాత్తుగా దర్శనమిచ్చిన కరుణాస్ ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. తాను చెన్నైలోనే ఉన్నానని స్పష్టం చేశారు.
కరుణాస్ తన ప్రసంగంలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలను ఉద్దేశించి మాట్లాడారు. తాను కూడా ‘తేవార్’ సామాజిక వర్గానికి చెందిన వాడినే అయినప్పటికీ తన విధేయులు మాత్రం శశికళ పంచన చేరారని పేర్కొన్నారు. అయితే, తమ సామాజిక వర్గంలో విధేయతలేని వారు మాత్రం ఈపీఎస్ క్యాంపులో చేరారని పళనిస్వామిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కరుణాస్ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. హిందు మక్కల్ మున్నాని చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్‌కు ఫిర్యాదు చేసింది.
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో స్పందించిన కరుణాస్ మాట్లాడుతూ.. తాను ఏ సామాజిక వర్గాన్నీ కించపరచలేదని పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయబోనని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కేవలం తన కమ్యూనిటీ డిమాండ్ల గురించి మాత్రమే మాట్లాడానని, ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.