Rafel: చైనా, పాకిస్థాన్‌లకు రాహుల్ సాయపడుతున్నట్లుంది : కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
- రాఫెల్ ఆయుధ, సాంకేతిక వివరాలు కోరుతున్నది అందుకోసమేనేమో
- డసాల్ట్ కంపెనీని ఎల్-1గా గుర్తించింది యూపీయే ప్రభుత్వమే
- ముడుపులిచ్చేందుకు ఆ కంపెనీ అంగీకరించకే అప్పట్లో పక్కన పెట్టారు
అనవసర రాద్ధాంతం ద్వారా రాఫెల్ సాంకేతిక పరిజ్ఞానం వెల్లడయ్యేలా చేసి మన శత్రుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లకు పరోక్షంగా సాయపడాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీలో ఉన్నట్టుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘వాస్తవానికి డసాల్ట్ కంపెనీనీ ఎల్-1 (ప్రథమ ప్రాధాన్యం)గా 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే గుర్తించిన విషయాన్ని రాహుల్ మర్చిపోయినట్లున్నారన్నారు.
ఆనాడు ఇతరత్రా ప్రయోజనాల కోసం డసాల్ట్‌పై ఒత్తిడి చేసినప్పటికీ వారు అంగీకరించక పోవడంతో పునఃపరిశీలన పేరుతో తాత్సారం చేశారని విమర్శించారు. ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేకుండా రిలయన్స్ డిఫెన్స్, డసాల్ట్ ఏవియేషన్ సంస్థలు 2007లోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చాయని, తొమ్మిదేళ్ల తర్వాత ఒప్పందం ఖరారైందని తెలిపారు. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా, అవమానకరంగా ప్రధానిపై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కుటుంబ నేపథ్యంతో అందలం ఎక్కిన అవగాహనలేని నాయకుని అహం సంతృప్తి పరిచేందుకు జేఏసీ పేరుతో వారు చేసే డిమాండ్లు నెరవేర్చలేమని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లున్నాయని, రాహుల్ బావ రాబర్ట్ వాద్రాపై భూకబ్జా ఆరోపణలున్నాయని, వాటిపై ముందు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ కూడా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.