aaraku: అరకు టీడీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను కాల్చి చంపిన మావోయిస్టులు
- డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద సంఘటన
- క్షేత్రస్థాయి పర్యటనలో ఉండగా కాల్చివేత
- ఈ ఘటనను నిర్ధారించిన ఎస్పీ రాహుల్ దేవ్
విశాఖపట్టణం జిల్లాలోని అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్పి చంపారు. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. గ్రామకార్యదర్శిని కార్యక్రమంలో వారు పాల్గొని తిరిగి వస్తుండగా డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. వీరు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారని, మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో వీళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో యాభై మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. కాగా, ఈ సంఘటనను ఎస్పీ రాహుల్ దేవ్ నిర్ధారించారు. కిడారి, సోమపై దాడి జరిగినట్లు మాకు సమాచారం అందిందని, దాడిని నిర్థారించేందుకు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారని తెలిపారు. కాగా, ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో సర్వేశ్వరరావు చేరారు. గతంలో పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరించారు. 2014లో సర్వేశ్వరరావు తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.