Tollywood: సినిమాలో బోల్డ్ కంటెంట్ పై హడావుడి చేయడం సరికాదు!: నాగార్జున
- తెలుగులో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి
- సమ్మోహనంలో పాటలు నిజంగా అదుర్స్
- టాలీవుడ్ లో నాణ్యమైన పనితీరు కనిపిస్తోంది
అన్నమయ్య, మన్మధుడు నుంచి తాజా మల్టీస్టారర్ దేవదాస్ వరకూ కింగ్ నాగార్జున విభిన్నమైన పాత్రలనే ఎంచుకున్నారు. తాజాగా ఆయన నానితో కలిసి నటిస్తున్న దేవదాస్ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు. తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100, గూఢచారి, మహానటి వంటి సినిమాలు విజయవంతం కావడంపై నాగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా థియేటర్ కు కుటుంబంతో సహా వెళ్లి చూడగలిగే సినిమాలు రావడం లేదని పలువురు వ్యాఖ్యానించడంపై నాగార్జున స్పందించారు.
కుటుంబంతో కలసి చూడలేమని అనుకునే సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుంటేనే మంచిదని నాగార్జున అన్నారు. మంచి సినిమాలు వచ్చినప్పుడే థియేటర్ కు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారనీ, దానిపై కనీసం నిఘా పెట్టడం లేదని నాగ్ అభిప్రాయపడ్డారు. అలాంటివారే సినిమాల దగ్గరకు వచ్చేసరికి ‘అయ్యో.. చెడిపోతున్నారు!’ అని హంగామా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100, గూఢచారి, చి.ల.సౌ, మహానటి సినిమాలు తనకు బాగా నచ్చాయని నాగ్ తెలిపారు. ఈ సినిమాలన్నీ విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందాయన్నారు. సమ్మోహనం సినిమాలో పాటలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ప్రస్తుతం పరిశ్రమలో నాణ్యమైన పనితీరు కనిపిస్తోందనీ, ఇండస్ట్రీకి ఇది చాలా అవసరమని నాగార్జున వెల్లడించారు.