PMJAY: 50 కోట్ల మందికి ఉచిత వైద్యం.. ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించిన మోదీ!

  • జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
  • ఈ పథకంలో చేరేందుకు ముందుకురాని తెలంగాణ
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం

దేశంలోని 50 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆరోగ్య బీమాను కల్పించే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(పీఎంజేఏవై) ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద దాదాపు 10.74 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. పీఎంజేఏవై కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల బీమాను కల్పిస్తారు. ఈ పథకం కింద చేరేందుకు 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకరించగా, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, కేరళ, ఒడిశా రాష్ట్రాలు ముందుకు రాలేదు. తొలుత ఈ పథకానికి ఆయుష్మాన్ భారత్ గా నామకరణం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గా పేరును మార్చింది.

ఈ ఏడాది స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ పీఎంజేఏవై పథకాన్ని ప్రకటించారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు మెరుగైన వైద్యం పొందేందుకు వీలుగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. పీఎం జేఏవైని మోదీ ఈ రోజు ప్రారంభించినప్పటికీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుట్టినరోజైన సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద తొలివిడతగా రూ.3,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద అయ్యే మొత్తం వ్యయంలో కేంద్రం 60 శాతం, సంబంధిత రాష్ట్రాలు 40 శాతం భరిస్తాయని ప్రభుత్వం తెలిపింది. పీఎంజేఏవై కింద సేవలు అందించేందుకు 7,500 ప్రభుత్వ ఆసుపత్రులు, మరో 7,500 ప్రైవేటు ఆసుపత్రులు అంగీకరించాయని వెల్లడించింది. దాదాపు 1,350 వ్యాధులను చికిత్స జాబితాలో చేర్చినట్లు పేర్కొంది.

ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆధార్ లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు ఉన్నా సరిపోతుందని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డును ప్రజలు కలిగి ఉండటం తప్పనిసరి కాదని వెల్లడించారు. చికిత్స సందర్బంగా ప్రజలు ఒక్క రూపాయి కూడా ఆసుపత్రికి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

  • Loading...

More Telugu News