araku: కాల్చి చంపడానికి ముందు సర్వేశ్వరరావుతో గంటసేపు మాట్లాడిన మావోయిస్టులు!
- సర్వేశ్వరరావుకు చెందిన గూడ క్వారీ
- ఈ క్వారీని మూసివేయాలని మావోయిస్టుల హెచ్చరిక
- బెదిరింపులొద్దు..చర్చలతో పరిష్కరించాలన్న కిడారి
- దీంతో ఆగ్రహించి కాల్చి చంపిన మావోయిస్టులు
అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కాల్చి చంపడానికి ముందు గంట సేపు ఆయనతో మావోయిస్టులు మాట్లాడినట్టు స్థానికుల సమాచారం. ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు అరకులోనే ఉన్న సర్వేశ్వరరావు, అనంతరం, మాజీ ఎమ్మెల్యే సోమతో కలిసి లిమిటిపుట్టు గ్రామానికి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ గ్రామస్తులతో చర్చిస్తుండగా, సుమారు అరవై మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు. ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాలపై ఎమ్మెల్యేతో గంట సేపు వారు చర్చించారు.
హుకుంపేట మండలంలో సర్వేశ్వరరావుకు చెందిన గూడ క్వారీ, బాక్సైట్ తవ్వకాలపై ఆయన్ని మావోయిస్టులు ప్రశ్నించినట్టు సమాచారం. ఒడిశాలో ఎన్ కౌంటర్ కు సర్వేశ్వరరావే కారకులంటూ మావోయిస్టులు నిలదీశారు. ఈ క్వారీ కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, వెంటనే దాన్ని మూసివేయాలని మావోయిస్టులు హెచ్చరించగా, బెదిరింపులొద్దని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సర్వేశ్వరరావు వారికి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, ఆగ్రహించిన మావోయిస్టులు సర్వేశ్వరరావును కాల్చి చంపారు. కాగా, పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని కిడారి సోదరుడు ఆరోపిస్తున్నారు.