India: నిమజ్జనంలో పలుచగా కనిపించిన యువత, తగ్గిన సందడి... కారణమిదే!
- నిమజ్జనం రోజున భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్
- హైదరాబాద్ లో పెరిగిన కొలనుల సంఖ్య
- పదో రోజునే 9 వేల విగ్రహాల నిమజ్జనం
వినాయక నిమజ్జనమంటే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో యువతీ యువకుల సందడి ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, ఈ సంవత్సరం మాత్రం అనుకున్నంత జోష్ కనిపించలేదు. ఇందుకు కారణం, ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ ఉండటమే. సాధారణంగా అత్యధిక విగ్రహాలు చవితి తరువాత 9 లేదా 11వ రోజు నిమజ్జనం అవుతుంటాయి. 11వ రోజు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సవితి ఆధ్వర్యంలో ప్రధాన ఊరేగింపు ఉంటుంది. పైగా ఆదివారం నాడు 11వ రోజు రావడంతో జనం పోటెత్తుతారని భావించగా, క్రికెట్ కారణంగా పలు భక్తమండళ్లు ముందురోజే, అంటే శనివారం నాడే నిమజ్జనం పూర్తి చేసేశాయి.
శనివారం నాడు దాదాపు 9 వేల విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి. 11వ రోజు నిమజ్జనానికి రిజిస్టర్ చేసుకున్న విగ్రహాల్లో చాలామటుకు ఒక రోజు ముందే హుసేన్ సాగర్ కు తరలివచ్చాయి. దీనికితోడు నిమజ్జనానికి సిద్ధం చేసిన కొలనుల సంఖ్య పెరగడంతో, ఒక్కో కొలనులో సగటున 1,500 వరకూ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఈ కారణాలతో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో పెద్దగా యువత సందడి కనిపించలేదు.