Australia: ఆస్ట్రేలియాలో శిల్పాశెట్టికి తీరని అవమానం!
- జాతి వివక్షను ఎదుర్కొన్నాను
- చర్మం రంగును చూసి ప్రవర్తించే తీరు మారుతుందా?
- ఇన్ స్టాగ్రామ్ లో ప్రశ్నించిన శిల్పాశెట్టి
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి, సిడ్నీ నుంచి మెల్ బోర్న్ కు ప్రయాణిస్తున్న వేళ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. తనకు ఎదురైన అవమానాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న శిల్పా శెట్టి, ఎదుటివారి చర్మం రంగును చూసి ప్రవర్తించే తీరు మారుతుందా? అని ప్రశ్నించింది. తాను జాతి వివక్షను ఎదుర్కొన్నానని చెప్పింది. చెకిన్ కౌంటర్ వద్ద ఉన్న ఓ మహిళా ఉద్యోగి తీరును విమర్శించింది.
తన వద్ద రెండు బ్యాగులున్నాయని, వాటిల్లో ఒకటి అతిపెద్దదిగా ఉందంటూ అభ్యంతర పెట్టిన ఉద్యోగిని ప్రవర్తన తన మనసుకు కష్టాన్ని కలిగించిందని చెప్పారు. తాను పదేపదే బ్యాగును పరిశీలించాలని చెప్పినా, ఆమె వినలేదని, దగ్గరకెళ్లి అభ్యర్థించినా పట్టించుకోలేదని ఆరోపించారు. సమయం మించి పోతుండటంతో ఎక్కువ పరిమాణంలో ఉన్న లగేజీని పరిశీలించే సిబ్బంది వద్దకు తానే వెళ్లానని, వారు చూసి, తన బ్యాగ్ నిర్దేశిత పరిమితికి మించిన బ్యాగు కాదని చెప్పారని అన్నారు. ప్రయాణికుల పట్ల మర్యాద పూర్వకంగా ఉండేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సిడ్నీ విమానాశ్రయంలో తాను కూర్చుని ఉన్న ఓ చిత్రాన్ని శిల్పాశెట్టి పంచుకున్నారు.